Tuesday, 25 August 2015

Guntur Declaration

Guntur Declaration 

విజన్ - మిషన్ - ఐక్య సంఘటన 

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం - సన్నాహక సమావేశం 
23 ఆగస్టు 2015, గుంటూరు

విజన్ :

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రజాసమస్య రెండు రకాల పెడధోరణులకు బలైపోతోంది. ఒకవైపు, ఏ సమస్య తలెత్తినా కొన్ని శక్తులు దాన్ని భావోద్వేగ అంశంగా మార్చేసి ప్రజల్లోఒక ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయి. మరో వైపు, ప్రభుత్వాలు ప్రతి విషయంలోనూ తమ ఆశ్రితులకు ప్రయోజనం చేకూర్చే విధానాలను అనుసరిస్తున్నాయి. ఈ రెండు ధోరణులూ దీర్ఘకాలంలో నిర్ధిష్టంగా సామాన్యజనానికీ, స్థూలంగా మొత్తం సమాజానికీ నష్టాన్ని చేకూర్చేవే.
ఈ రెండు రకాల ప్రమాదాలను నివారించి, విశాల ప్రజానీకానికి దీర్ఘకాల ప్రయోజనాన్నీ సమకూర్చేలా సమస్యలను పరిష్కరించే మార్గాలను ఇప్పుడు పౌరసమాజం అన్వేషించాలి. అలాంటి శాస్త్రీయ ప్రతిపాదనల మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాంటి విధానాలని అనుసరించమని ప్రభుత్వాన్ని కోరాలి.

మిషన్ తక్షణ కార్యక్రమం 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అస్తవ్యస్థంగా విభజించారని ఇప్పుడు అధికారంలోవున్నవారి నుండి విపక్షాల వరకు అన్నీ రాజకీయ పార్టీలు అంటున్నాయి. నిజానికి అంతకన్నా అడ్డగోలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సాగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినవాళ్ళు, ఆ ఉద్యమానికి మద్దతు పలికినవాళ్ళు సహితం "అయ్యో! ఆంధ్రాకు మరీ ఇంత అన్యాయమా?" అనేంత అరాచకంగా, నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా (ఇంకా పదాలు, తిట్లూ, బూతులు వుంటే అవి కూడా చాలవన్నంతగా) ఈ విభజన జరిగింది.

విభజనానంతరం నవ్యాంధ్రప్రదేశ్ లో 1. ప్రత్యేక హోదా 2. వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధి, 3. కేంద్ర ప్యాకేజీలు 4. రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హామీల సాధన 5. కొత్త రాజధాని 6. హైకోర్టు 7. జోనల్ విధానం వంటి కొత్త సమస్యలు ముందుకు వచ్చాయి.

ఈ ఏడు సమస్యల మీద విశాల ప్రజానీకానికి దీర్ఘకాల ప్రయోజనకరంగా వుండే పరిష్కార మార్గాలను అన్వేషించాలి. అలాంటి శాస్త్రీయ ప్రతిపాదనల మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాంటి విధానాలని అనుసరించమని ప్రభుత్వాన్ని కోరాలి.

ఐక్య సంఘటన

ఆంధ్రప్రదేశ్ లో ప్రజా చైతన్యానికి కొరత లేదు. అనేకానేక ప్రజాసమూహాల సమస్యల పరిష్కారం కోసం తరతమ స్థాయిల్లో దశాబ్దాల తరబడి ఉద్యమిస్తున్న సంఘాలు, శక్తులు, వ్యక్తులు, కోకొల్లలుగా వున్నారు. ఆ సంఘాలు, శక్తులు, వ్యక్తులు తమతమ ప్రకటిత లక్ష్యాల కోసం తమ రంగాల్లో కృషిచేస్తూనే, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం లక్ష్యాల సాధన కోసం కలిసిరావాలని వారిని కోరుతున్నాము.

No comments:

Post a Comment