Thursday, 15 October 2015

ప్రజల పక్షాన నిలబడదాం - భావసంచయనం సాగిద్దాం

ప్రజల పక్షాన నిలబడదాం - భావసంచయనం  సాగిద్దాం

కో-కన్వీనర్లు, క్రియాశీల కార్యకర్తలు, కార్యకర్తలకు,

మిత్రులారా!

ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఒక కొత్త శక్తి..  ఇప్పుడు మన గురించి అనేక సమూహాల్లో  విస్తృత చర్చ సాగుతోంది. ఇది మనం సాధించిన తొలి విజయం. ఇక మనం విస్తరణ మీద దృష్టి పెట్టాలి.

అభివృధ్ధి పేరుతో సాగుతున్న పెరుగుదల (Growth versus Development)  ఆంధ్రప్రదేశ్ లో ఒక  సామాజిక సంక్షోభంగా మారుతోంది. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆతృతను చూపించేకొద్దీ సంక్షోభం పెరుగుతుంది.

తమ అస్థిత్వాలని, జీవికను కాపాడుకోవడానికి అనేక సామాజిక శ్రేణులు అనేక చోట్ల పెనుగులాడుతున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా సంస్థల ఆసక్తి కూడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలే కనుక ప్రజల పెనుగులాట వార్తలు ప్రచురణ, ప్రసారాలకు నోచుకోవడంలేదు. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం గొంతులేనివారికి బలమైన గొంతుగా మారాల్సిన అవసరం వున్నది.

మీ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీదా తక్షణం  స్పందించండి. బాధిత సమూహాలకు మద్దతు పలకండివాళ్ళ సమస్యల్ని, వాటికి పరిష్కార మార్గాల్ని వీలయినన్ని విధాలా ప్రచారం చేయండి. పత్రికా ప్రకటనలు ఇవ్వండి. బాధితులకు మద్దతుగా విభిన్న సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనండి. వీలయిన చోట్ల స్వయంగా సభలు, సమావేశాలు నిర్వహించండి. భావసారూప్యంగల వ్యక్తులు సంస్థలతో కలిసి పనిచేయండిన్యూస్ ఛానళ్ళు నిర్వహించే చర్చల్లో చురుగ్గా పాల్గోండి. ( ఒక న్యూస్ ఛానల్ లో పనిచేస్తూ వుండడంవల్ల వ్యక్తిగతంగా నాకు  అవకాశం లేదు.) విస్తారంగా వ్యాసాలు రాయండి. కరపత్రాలు ముద్రించి పంచండిచిన్నచిన్న పుస్తకాలు ప్రచురించండి. ఇతర భాషల్లో మంచి వ్యాసాలు వస్తే అనువాదాలు  చేయండివీలయినంత మేరకు ప్రధాన స్రవంతి మీడియాను వాడుకోండి. వీలుకానప్పుడు ఉపస్రవంతి, సోషల్ మీడియాలు ఎలాగూ మనకు అందుబాటులో వున్నాయి. వాటిని  సంపూర్ణంగా వినియోగించుకోండి.   సంస్థ ఫేస్ బుక్  వాల్ ని నిర్వహించడానికి మనకు చిన్న ఏర్పాటు వుంది. దాన్ని పటిష్టం చేసుకోవాలి. వాట్సప్ ను మన సిహెచ్ సుబ్బరాజు నిర్వహిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లో ఏరోజుకారోజు  మీ ఆడియో వీడియో కామెంట్స్ ను రికార్డు చేసి  ఫేస్బుక్ లో పెట్టవచ్చు. మన హైదరాబాద్ మీటింగు ఏవీ క్లిప్పింగులు మంచి ప్రభావాన్ని చూపాయిత్వరలో ఒక వెబ్ సైట్ ను కూడా నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద విస్తృతంగా భావసంచయనం (Intellectual Articulation) సాగించడం నేటి అవసరం..

భావసంచయనం సాగించడానికి సంస్థలో ఎవరూ ఎవరి అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. మన సంస్థ  లక్ష్య ప్రకటన, వివిధ సదస్సుల్లో, సందర్భాల్లో మనం చేస్తున్న తీర్మానాలు, మనం తీసుకునే నిర్ణయాలే  మనందరికీ మార్గదర్శకాలు. వాటిని దృష్టిలో పెట్టుకుని పరిధి పరిమితుల్లో  అందరూ  ప్రో-యాక్టివ్ గా మారాలి.  

అదుపువ్యవస్థ లేకపోవడంవల్ల సోషల్ మీడియాలో మాట  జారే సంస్కృతి విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రవాహంలో కొట్టుకుపోవద్దు. మనకు ఒక్కటే కొలమానం; మన రాతలు, మన మాటలు మన సంస్థ గౌరవాన్ని, సంస్కారాన్నీ,   పరిశోధనా ఆసక్తినీ, మేధోస్థాయినీ, సామాజిక బాధ్యతల్ని పెంచేలా వుండాలి. సమస్యల పరిష్కారానికి  తటస్థ వ్యక్తులుసమూహాల మద్దతును కూడగట్టేలా వుండాలి.

మీ సూచనల్ని ఆహ్వానిస్తున్నాను.

ఇక విజృంభించండి.

అభినందనలతో
- డానీ
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం

15 అక్టోబరు 2015 

No comments:

Post a Comment