Tuesday 16 May 2023

Victory of Kannada civil society democracy

 కన్నడ పౌరసమాజ ప్రజాస్వామ్య విజయం

ABN , First Publish Date - 2023-05-16T01:05:03+05:30 IST

Victory of Kannada civil society democracy 

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఒక ఉక్కపోత వాతావరణంలో కొంత హాయిని కలిగించే గాలిలా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దాని నాయకత్వం తాము ఏది చేసినా చెల్లుతుందని, తమకు ఎదురులేదని ఒక భయానక స్థితిని కల్పించాయి. ఈ కాస్త ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతుందా, రాజ్యాంగ విలువలు నిలదొక్కుకోగలుగుతాయా, అసలు రాజ్యాంగం ఈ ధాటికి నిలుస్తుందా అన్న కొన్ని మౌలిక సవాళ్లు దేశం ఎదుర్కొంటున్నది. 

భారతీయ జనతాపార్టీ కేవలం ఇతర రాజకీయ పార్టీల వలె నిర్మాణమైతే సమస్య ఏం లేదు. సమస్యల్లా ఆ పార్టీని నడిపించే మాతృసంస్థల భావజాలమే జటిలమైన సమస్య. రాజ్యాంగ విలువలు ఒక్కరోజు పుట్టినవి కావు. వాటి వెనుక ప్రపంచవ్యాప్త ప్రజాపోరాటాలు, స్వాతంత్రోద్యమాలు, అసాధారణమైన త్యాగాలు, నూతన మానవ విలువలు, ఉన్నతమైన, ఉదాత్తమైన మానవ సంబంధాలు వాటి పునాదుల్లో ఉన్నాయి. చరిత్ర ముందుకుపోవడం, మానవ నాగరికత మరింత వికాసం చెందడానికి ఉన్నతమైన విలువలతో కూడిన నాగరిక సమాజం నిర్మాణం దిశలో ప్రయాణం ఉండాలి. సమాజాన్ని, ప్రజలని ముఖ్యంగా బలహీనులని ప్రేమించే తాత్వికత కావాలి. మనుషులని ద్వేషించడం, తమ భావజాలాన్ని అంగీకరించని వారిని ద్రోహులుగా, శత్రువులుగా భావించడంలోనే ప్రమాదం ఉంది. ఇవాళ సమస్యల్లా ఇలాంటి భావజాలమే.

ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీయైనా తన భావజాలాన్ని ప్రచారం చేసుకోవచ్చు. కాని ప్రతిపక్ష పార్టీలని రాజ్య యంత్రాంగాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేయడం గతంలో ఇందిరాగాంధీ పాలనలో కొంత జరిగినా, బిజెపితో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఆ ధోరణులకు అడ్డుకట్ట వేయగలిగారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని నడిపిస్తున్న శక్తులు తాము ఏది చేసినా, చట్టబద్ధ పాలనను ఖాతరు చేయకపోయినా, తాము ద్వేషించే వారి మీద ఏ దాడి చేసినా తమకు పూర్తి రక్షణ ఉంటుందనే బలం దీర్ఘకాలంలో చట్టబద్ధ పాలనకు ప్రమాదమే కాక, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే సమాజం అన్ని సమూహాలు క్రమక్రమంగా అదే మార్గం పడితే ఇక మిగిలేది ఒక అరాచక వ్యవస్థే.

ఈ చారిత్రక నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూడవలసి ఉంటుంది. గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామిక విలువలతో కూడిన పార్టీ అని ఎవ్వరూ అనుకోవడం లేదు. అయితే ఆ పార్టీకి మద్దతిస్తున్న శక్తులు ద్వేషభావజాలంతో మండిపోతున్నవి కావు. వాళ్లు కొంతైనా రాజ్యాంగ విలువలను గౌరవిస్తారని, మెరుగైన పాలనను అందిస్తారని, ప్రజల సంక్షేమం గురించి కొంత పట్టించుకుంటారని కర్ణాటక సమాజం భావించింది. ఐదు సంవత్సరాలుగా కర్ణాటక సమాజం ఎదుర్కొన్న శాంతిభద్రతల సమస్య, మతపర ద్వేషం కర్ణాటకలోని పెట్టుబడిదారీ శక్తులకు కూడా సమస్యాత్మకమైంది. ఒక దశలో పారిశ్రామిక సంస్థలు, ఐటి రంగం, తాము బెంగళూరు నుంచి చెన్నై లేదా హైదరాబాద్‌కు తమ పరిశ్రమలను తరలిస్తామని హెచ్చరించారు. నిజానికి భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడికి, సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాకి కాంగ్రెస్‌ పార్టీ కంటే ఎక్కువ మద్దతు ఇవ్వడమే కాక, వాళ్లు కోరుకున్న అన్ని రాయితీలను కల్పించింది. ఈ రాయితీలతో పాటు పెట్టుబడి ఒక సామరస్య, సౌభ్రాతృత్వ సమాజాన్ని కోరుకుంటుంది. ఈ అభివృద్ధి నమూనా తీవ్రమైన అసమానతలకు దారితీసినప్పుడు అనివార్యంగా సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. ఈ అసంతృప్తిని ఎదుర్కొనడానికి అధికార పార్టీ ఎన్నుకున్న మార్గాన్ని కర్ణాటకలోని కార్పొరేట్‌ శక్తులు హర్షించలేదు. భారతీయ జనతా పార్టీ ఈ వైరుధ్యంలో చిక్కుకుంది.

కర్ణాటక సమాజానికి ఒక సుదీర్ఘమైన ప్రజాస్వామ్య, ఉదారవాద సంస్కృతి, సంస్కారం ఉంది. బసవన్న ఆలోచనాధార, నిచ్చెనమెట్ల సమాజాన్ని ప్రశ్నించి సామాజిక న్యాయభావనకు బలమైన బీజాలు వేసింది. ఆ తర్వాత ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, సినిమా స్రష్టలు దాకా బసవన్న ఆలోచనాధారని సుసంపన్నం చేశారు. ఈ ఆలోచనాధార నుంచే దేవనూరు మహాదేవ లాంటి అద్భుత రచయిత ఎదిగారు. సమకాలీన కర్ణాటక సమాజంలో ఆయన ప్రభావం దళితశక్తుల మీదే కాక అన్ని ప్రజాస్వామ్య శక్తుల మీద విస్తృతంగా ఉంది. ఆయన జీవన శైలి చూస్తే నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత మనను ఆకట్టుకుంటాయి. ఈ నైతిక శక్తి వలన ఆయన రాసిన ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌: దాని లోతుపాతులు’’ అనే పుస్తకం లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. తన పుస్తక ప్రచురణ హక్కుని తెలంగాణలో కాళోజీ లాగే ప్రజలకు ఇచ్చారు. ఈ పుస్తక ప్రభావం కర్ణాటక సమాజం మీద, ఎన్నికల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడింది. సమాజంలో ద్వేష రాజకీయాలు పుంజుకున్నప్పుడు కవులు, రచయితలు ఎలాంటి పాత్ర నిర్వహించాలో ఆయన నుంచి నేర్చుకోవలసి ఉంటుంది.

ప్రజాస్వామ్య వారసత్వం వల్ల కర్ణాటకలో ఒక సజీవమైన పౌరసమాజం ఉంది. ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పౌరసమాజ ఛాయలు కూడా కనిపించవు. పౌర సమాజంలో పని చేస్తున్న 102 ప్రజాసంఘాలు తమ విభేధాలను పక్కకు పెట్టి అందరూ కలిసికట్టుగా గత ఆరు నెలలుగా రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు చేసిన కృషి నమ్మశక్యం కాని ఎత్తులో ఉంది. వాళ్లు ఎడ్డురే కర్ణాటక, మేలుకో కర్ణాటక అనే నినాదం చేపట్టారు. వాళ్లు 250 వర్క్‌షాప్స్‌, 103 నియోజకవర్గాల్లో, 192 బృందాలుగా ఏర్పడి, ఐదువేల మంది కార్యకర్తలు పనిచేశారు. వీళ్లు నలభై ఒక్కవేల కుటుంబాల వివరాలు సేకరించారు. 650 పోస్టర్స్‌, ఎనభై వీడియోలు, ఏడు ఆల్బమ్‌లను విడుదల చేశారు. పది లక్షల కరపత్రాలను పంచారు. అంతేకాక చిన్న చిన్న పార్టీల నుంచి పోటీ చేస్తున్న 49 మంది అభ్యర్థులను పోటీ నుంచి విరమించుకునేలా ఒప్పించారు. వంద విలేఖరుల సమావేశాలు నిర్వహించారు. యాభై ధర్నాలు (రైతులు, కార్మికులు, దళితులు, స్త్రీలు, విద్యార్థులు, ఆదివాసీలతో) నిర్వహించారు. మొత్తంగా 31 జిల్లాలలో 151 తాలూకాలలో ప్రచారం చేశారు.

ఈ వివరాలు చూసిన ఎవరికైనా ఆశ్చర్యం వేయక తప్పదు. భారతీయ జనతాపార్టీ విజయంలో చాలా అంకితభావంతో పనిచేసే వేలాది కార్యకర్తలున్నారు. ఏ ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఇలాంటి కార్యకర్తలు లేరు. ఆ పార్టీ బలమంతా ఈ కార్యకర్తలే. వారి కృషికి సమానస్థాయిలో కర్ణాటకలో ఈ ప్రజాసంఘాల కార్యకర్తలు పనిచేశారు.

కర్ణాటక చేసిన ఈ ప్రయోగం చాలా విలువైనది. వాళ్లు ఎక్కడా ఫలానా పార్టీకి ఓటు వేయండి అని ప్రచారం చేయలేదు. విద్వేష రాజకీయాలకు మద్దతు ఇవ్వకండి అని మాత్రమే ప్రచారం చేశారు. ఎక్కడా భారతీయ జనతా పార్టీ పేరు కూడా తీసుకోలేదు. ఎన్నికల రాజకీయాలకు బయట పనిచేశారు. వాళ్లు చేసిందల్లా పౌరసమాజ చైతన్యాన్ని పెంచడం. ప్రజాస్వామ్య సమాజాలు, దేశాల భవిష్యత్తును రాజకీయ పార్టీలకే వదలకూడదు. మనదేశంలో అమలులో ఉన్న అభివృద్ధి నమూనా నిర్బంధం లేకుండా అమలుచేయడం సాధ్యం కాదు. కాంగ్రెస్‌ పార్టీ కాలంలో కూడా ఎన్నో నిర్బంధ చట్టాలు వచ్చాయి. భిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహారశైలిలో ఈ నియంతృత్వ ప్రవర్తన చూడవచ్చు. ఈ అభివృద్ధి స్వభావమే అలాంటిది. దీనికి తెలంగాణయే పెద్ద ఉదాహరణ. ఒక సామాజిక ఉద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీ ప్రవర్తన మిగతా పార్టీలకు భిన్నంగా లేదు. ఇలాంటి చారిత్రక సందర్భంలో ఏ సమాజంలోనైనా ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడం చైతన్యవంతమైన సమాజానికే సాధ్యం. అలాంటి సమాజ నిర్మాణమే ఇవాళ దేశభవిష్యత్తు గురించి మధనపడే వాళ్ల సామాజిక, చారిత్రక బాధ్యత.

ప్రొ. జి. హరగోపాల్‌ 


No comments:

Post a Comment