|
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మార్కెట్ కమిటీల ఆదాయానికి, ఉద్యోగుల రిటైర్మెంట్‌కు ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ గత ఏడాది జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే, కార్పొరేషన్లు, న్యాయస్థానాలు, మార్కెట్ కమిటీలు, స్థానిక సంస్థల విషయంలో విడివిడిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ ఉద్యోగుల రిటర్మెంట్ వయస్సుపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆదాయం బాగా ఉన్న మార్కెట్ కమిటీల్లో పనిచేసే ఉద్యోగులకు 60 ఏళ్లకు, ఆదాయం లేని కమిటీల్లో పనిచేసే ఉద్యోగులకు 58 ఏళ్లకు రిటర్మెంట్ ఉండేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై జీవో జారీ చేసే సమయానికి ఈ నిర్ణయంపై వివాదం నెలకొంది. ఉంటే 58 ఏళ్లు ఉండాలి లేదా 60 ఏళ్లు ఉండాలి తప్ప మార్కెట్ కమిటీల ఆదాయాన్ని బట్టి రిటైర్మెంట్ వయసు నిర్ణయించడం సాధ్యం కాదని న్యాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఫైలు పునఃపరిశీలన కోసం సీఎం వద్దకు వెళ్లనుంది. మార్కెట్ కమిటీ ఉద్యోగులు దేనికి దానికి విడివిడిగా నియమితులు కారు. ఒక కమిటీ నుంచి మరో కమిటీకి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని రిటైర్మెంట్ వయోపరిమితిని నిర్ణయించడం సబబుకాదని న్యాయశాఖ తన అభిప్రాయం చెప్పినట్లు తెలిసింది.
మళ్లీ రుణానికి సిద్ధమైన ఏపీ
ఆంధ్రప్రదేశ్ అప్పు కోసం మరోసారి మంగళవారం ముంబైలోని రిజర్వు బ్యాంకులో రూ.1000కోట్ల విలువైన బాండ్లను వేలం వేసేందుకు సిద్ధమైంది. ఓవర్‌డ్రాఫ్టులు, వేస్ అండ్ మీన్స్ కోసం ఇప్పటికే అనేక సార్లు రిజర్వు బ్యాంకును ఆశ్రయించింది. |
No comments:
Post a Comment