Monday, 12 January 2026

Capital Status of Amaravati is not yet legalised

 CM Chandrababu Appeal: ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించండి

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:56 AM

రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించేందుకు ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం చంద్రబాబు కోరారు.

CM Chandrababu Appeal: ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించండి

బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించండి

నిధులు, ప్రాజెక్టులతో ఏపీని ఆదుకోండి

‘జీ రామ్‌ జీ’తో రాష్ట్రంపై అదనపు భారం

ప్రత్యామ్నాయ నిధులు ఇవ్వండి

అమిత్‌ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ,

మద్యం కేసులో జగన్‌ పాత్రపై చర్చ?

న్యూఢిల్లీ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించేందుకు ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం చంద్రబాబు కోరారు. 2024 నుంచే ఏపీకి రాజధానిగా అమరావతి నిర్ణయించాలని కోరారు. దీనివల్ల రాజఽధానిలో పెట్టుబడులు పెట్టే వారికి భరోసా కలుగుతుందని చెప్పారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఆర్థిక మద్దతు ఇవ్వాలని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రప్రాయోజిత పథకాల్లో రాష్ట్రానికి వాటా పెంచాలని... గృహ నిర్మాణం, రహదారులు, రైల్వే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యమివ్వాలని అభ్యర్థించారు. రెవెన్యూలోటును భర్తీ చేసేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం పోలవరం పర్యటన ముగించుకున్న అనంతరం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. అమిత్‌షా నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులతోపాటు రాజకీయ అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ‘‘వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి. రాయలసీమను హార్టికల్చర్‌ కేంద్రంగా అభివృద్ది చేసేందుకు బడ్జెట్‌లో నిధులు ఇవ్వాలి. డిసెంబరు 25న పూర్వోదయ, సాస్కీ పథకాల కింద రూ.10,054కోట్ల మేరకు నిఽధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రతిపాదనలు సమర్పించాం. వీటిపై సానుకూలంగా స్పందించండి. పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వండి’’ అని చంద్రబాబు కోరారు.